Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగపూర్ తో గ్యాప్ వచ్చింది... అది సరిచేయడానికే ఇక్కడికి వచ్చాను: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Repairing Gap with Singapore
Advertisement
  • సింగపూర్ లో తెలుగు వారితో సీఎం చంద్రబాబు సమావేశం
  • సింగపూర్ మళ్లీ ఏపీ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చన్న చంద్రబాబు
  • కానీ జరిగిందేమిటో వారికి వివరిస్తానని వెల్లడి
Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన తొలిరోజున ఏపీఎన్ఆర్ టీ భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలుగు డయాస్పొరా కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్ తో పాటు, పొరుగున్న మరో ఐదు దేశాల నుంచి తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు.

“సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం... గౌరవం. నీతి, నిజాయతీలకు సింగపూర్ దేశం నిలువెత్తు నిదర్శనం. ఈ దేశంలో అవినీతి తక్కువ. సింగపూర్ రోడ్ల మీద ఒక్క కాగితం ముక్క కూడా కన్పించదు. చాలా కాలం క్రితమే చెత్తను కూడా ఎనర్జీగా కన్వెర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది. అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశాను. చాలా మంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళతారు. కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారు. ఇలాంటి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి గ్యాప్ వచ్చింది. 

నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్ షిప్ లు కట్టింది. కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికే అప్పగించాను. కానీ 2019లో ప్రభుత్వం మారి సింగపూర్ ను తప్పు పట్టే పరిస్థితి తీసుకువచ్చారు. వాటిని సరిదిద్ది... రికార్డులు సరి చేయడానికే సింగపూర్ వచ్చాను. ఏపీ బ్రాండును సింగపూర్ లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా... తెలుగు వాళ్లే చేశారంటారు. ఆ అభిప్రాయాన్ని... సింగపూర్ ప్రభుత్వంలో, సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాను. సింగపూర్ కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని వారికి చెబుతున్నాను. 

సింగపూర్ ప్రభుత్వం మళ్లీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు. జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియచేస్తాను. 2019లో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే.. అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. కానీ 2019 ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత నా మీదే కాదు... మీ మీద కూడా ఉంది” అని చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు.

పెట్టుబడులతో రండి

“గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సాంకేతికంగా చాలా అంశాలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రకటించాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఏపీలో 20 పోర్టులు వస్తాయి.. 15-20 ఎయిర్ పోర్టులకు అవకాశం ఉంది. ఆరోగ్య రంగంలో గేట్స్ ఫౌండేషన్, టాటా సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. చాలా మంది తెలుగు వాళ్లు విదేశాల్లోని ప్రముఖ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇలాంటి వారు తమ అనుభవాన్ని ఏపీకి అందించవచ్చు. పీ4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు నో పావర్టీ మిషన్ ప్రారంభించాను. మీ మీ గ్రామాల్లోని పేదలను దత్తత తీసుకోండి. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్లు.. పీ4లో భాగస్వాములుగా ఉంటే.. నాకు అంతకు మించిన ఆనందం వేరొకటి ఉండదు. 
 
ఏపీలో వెంకన్న ఉండడం మన అదృష్టం

“తిరుపతి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం అదృష్టం. ఎన్ని కష్టాలున్నా.. వేంకటేశ్వరస్వామిని తలుచుకుని సంకల్పం తీసుకుంటే సమస్య పరిష్కారమై పని అయిపోతుంది. ఎన్నార్టీలకు తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి దేశ రాజధానిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి. సింగపూర్ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతికి నేరుగా విమానాలు వచ్చేలా చేస్తాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. సింగపూర్ లో బెంగాలీ, హిందీ, తమిళ్ రెండో భాషగా ఉన్నాయి. తెలుగు కూడా రెండో భాషగా పెట్టాలని కోరుతున్నాను. ఇక్కడే ఉన్న భారత హైకమిషనర్ ఈ మేరకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను” అని చంద్రబాబు చెప్పారు.

 సరైన నాయకుడు ప్రధాని మోదీనే

 “ప్రస్తుతం భారత దేశానికి ప్రజలే ఆస్తి. గతంతో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి గౌరవం పెరిగింది. ఈ సమయంలో దేశానికి సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రధానులు... చాలా మంది సీనియర్ లీడర్లను చూశాను. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోదీ. మోదీ మనకు పెద్ద వరం. అమెరికాకు చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో మోదీ ప్రపంచంలోనే పాపులర్ లీడరుగా నెంబర్-1 స్థానంలో నిలిచారు. ప్రధానికి 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉంది. దేశానికి గుర్తింపు, సుస్థిరత మోదీ వల్లే వచ్చింది. ఇలాంటి సమయంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలి. నరేంద్ర మోదీ వికసిత్ భారత్ నినాదంతో వెళుతన్నారు. నేను స్వర్ణాంధ్ర సంకల్పంతో ముందుకెళుతున్నాను” అని అన్నారు. 
Advertisement
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
Amaravati
Seed Capital
Investments
Narendra Modi
Telugu Diaspora
APNRTS
Viksit Bharat

More Telugu News